​దర్శకత్వం ఒకరిది..పోస్టర్‍పైన పేరొకరిది…

Standard

నేరం ఒకరు చేస్తే శిక్ష ఒకరికి పడినట్టుంది స్నాప్ డీల్ పరిస్థితి. స్నాప్ చాట్ సీఈఓ ఇవాన్ స్పీగల్ తమ యాప్ భారత్ వంటి పేద దేశాల కోసం తయారు చేసి‍ంది కాదంటూ వ్యాఖ్యలు చేశారు.చేశారని మనం నేరుగా వినకపోయినా అన్నట్టు వార్తలు బయటకి రావడంతో దేశమంతా కోపంతో రగిలిపోతోంది. ఆ యాప్ ను ఫోనుల్లోంచి తీసేయాలని చెత్త రే‍టింగ్‍లు ఇవ్వాలని ప్రచారాలు మొదలుపెట్టారు. 

ఉరుము ఉరుమి మంగలం మీద పడిందట. అలానే స్నాప్ చాట్ ను వ్యతిరేకిస్తున్న వారంతా స్నాప్ డీల్ ను పట్టుకున్నారు. ట్విట్టర్, ఫేస్‍బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో స్నాప్ డీల్‍కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. స్నాప్ డీల్ యాప్ ను డిలీట్ చేస్తూ దానికి చెత్త రేటింగ్ ఇస్తున్నారు. ఒక రోజంతా ఇదే కొనసాగ‍డంతో పాపం స్నాప్ డీల్ తన రేటింగ్ ను దిగజార్చుకోవాల్సి వచ్చింది.

ఇదొకటే అనుకుంటే ఈ వివాదం పూర్తవ్వకముందే మరోసారి సామాజిక మాధ్యమాల్లోని ప్రజలు పేరు విషయంలో తప్పులో కాలేసారు. మసీదులో ప్రార్ధనల వల్ల తన నిద్ర చెడిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సింగర్ సోనూ నిగమ్. ఇంతకు ముందు స్నాప్ విషయంలో తికమకపడినట్టు ఇప్పుడు సోనూకి పొరబడ్డారు. ఈ సారి బలైంది నటుడు సోనూ సూద్.

మత వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని అతని సినిమాలు నిషేధించాలని సోనూ సూద్‍పై వ్యతిరేక పోస్టులు పెట్టారు. అసలు ఏం జరుగుతోందో అర్ధ‍ంకాక ఏకంగా సోనూ సోద్ తన ఆశ్చర్యాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశాడు. ఎవరు ఎవరితో ఏమన్నారో, ఎవరు తనని ఏమంటున్నారో ఏం చెప్పమంటున్నారో అ‍ర్ధం కావట్లేదంటూ ట్వీట్ చేశాడు.

వ్యాఖ్యలు చేసే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కనీసం వివరాలు తెలుసుకుని నిర్ధారించుకుని చేయడం మంచిదేమో. లేకపోతే బాహుబలి 2లో సంపూర్ణేష్ బాబుకు బెస్ట్ హీరో అవార్డు వచ్చినట్టుంటుంది.

Advertisements